సహాయ శిబిరాల్లో 20 లక్షల మంది నిరాశ్రయులు 12 రోజుల తర్వాత కొన్నిచోట్ల కనిపించిన సూరీడు

0
155
దాదాపు వంద విమానాలు, హెలికాప్టర్లు రాత్రింబవళ్లూ చక్కర్లు కొడుతున్నాయి! 500 పడవలు నిర్విరామంగా తిరుగుతున్నాయి! ఆర్మీ.. నేవీ.. ఎయిర్‌ఫోర్స్‌.. ఎన్డీఆర్‌ఎఫ్‌ తదితరాలకు చెందిన వందలాదిమంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. వందలాదిగా మత్య్సకారులు, స్థానికులు నడుం బిగించారు. తాజాగా కోస్ట్‌ గార్డ్‌ రంగంలోకి దిగింది! అయినా.. ఇంకా వేల మంది వరదల్లోనే చిక్కుకుని ఉన్నారు. కొంతమంది ఇళ్లల్లోనే నడుంలోతు.. గుండెల్లోతు నీటిలో భయం భయంగా గుండె చిక్కబట్టుకుని ఉన్నారు. మరికొందరు ఇళ్లు, చెట్లు తదితరాలపైకి ఎక్కి కూర్చున్నారు. ఐదారు రోజులుగా వారికి తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. తమను కాపాడే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అళపుఝ, త్రిసూర్‌, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అళపుఝ జిల్లాలోని ఒక్క చెంగన్నూర్‌ గ్రామంలోనే 5000 మంది చిక్కుకున్నారు. బుధవారం రాత్రి ఓ చర్చి కుప్పకూలడంతో ఎర్నాకుళం జిల్లాలోని పారావూర్‌లో ఆరుగురు మరణించారు. ఇక్కడ 600 మంది తలదాచుకుంటున్నారు. నడుంలోతు నీటిలో తాము ఉన్నా ఇప్పటి వరకూ ఎవరూ తమను కాపాడడానికి రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి వరద వెల్లువెత్తింది. ఓ 24 ఏళ్ల కుర్రాడు తన తల్లి, సోదరులను రక్షించాడు. వృద్ధుడైన తండ్రిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే ప్రవాహంలో జారిపడ్డాడు. నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టు కొమ్మను పట్టుకున్న తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ప్రవాహంలో జారిపడిన కొడుకు మాత్రం మరణించాడు.
రాత్రింబవళ్లు సహాయ కార్యక్రమాలు
వాతావరణం అనుకూలించకపోయినా.. కొండచరియలు విరిగి పడుతున్నా.. వర్షం కురుస్తున్నా.. రాత్రింబవళ్లు సహాయ పునరావాస కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వరద ప్రవాహ ఉధృతి వారి ముందరి కాళ్లకు బంధాలు వేస్తోంది. ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది శనివారం రాత్రంతా సహాయ కార్యక్రమాల్లోనే నిమగ్నమైంది. ఇడుక్కి డ్యాం సమీపంలో ఓ బాలింత, ఆమె నవజాత శిశువును కాపాడింది. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతుండడంతో.. మారుమూల ప్రాంతాలకు సహాయ బృందాలు వెళుతున్నాయి. వారికి ఆహారం, నీళ్లు తదితర నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాయి.
శిబిరాల్లో 20 లక్షల మంది
కేరళ వరదలకు ఇప్పటి వరకు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 4000 సహాయ శిబిరాల్లో వారు తలదాచుకుంటున్నారు. ‘‘ఇది మాకు పునర్జన్మ. నాలుగు రోజులుగా ఆహారం, నీళ్లు లేవు. చూట్టూ మెడలోతు నీళ్లు. అందులోనే ఉన్నాం’’ అని పథనంతిట్ట జిల్లాలోని రణ్ణి సహా య శిబిరానికి వచ్చిన ఓ మహిళ తమ కష్టాన్ని వివరించారు. కాగా, 9 లక్షల లీటర్ల మంచినీటితో కూడిన రైలును కేరళకు పంపించినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.
కొట్టుకుపోయిన 134 బ్రిడ్జిలు
కేరళ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఏకంగా 40 వేల హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి. వెయ్యికిపైగా ఇళ్లు పూర్తిగా.. 26 వేలకుపైగా ఇళ్లు పాక్షికంగా కుప్పకూలాయి. 134 బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. 16 వేల కిలోమీటర్ల రోడ్లు అసలు ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇక, 9 సర్వీసులను పాక్షికంగా.. 18 సర్వీసులను పూర్తిగా రైల్వే రద్దు చేసింది. పలు సర్వీసులను దారి మళ్లించింది. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులేవీ తిరగడం లేదు.
ఆరా తీసిన రాష్ట్రపతి కోవింద్‌
కేరళలో వరద పరిస్థితిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరా తీశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్‌ పి.సదాశివంతో ఆదివారం ఆయన మాట్లాడారు. కష్టకాలంలో కేరళీయుల ధైర్యసాహసాలు అమోఘమని కొనియాడారు. మొత్తం దేశమంతా వారి వెన్నంటి ఉందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
కేరళకు ఉపగ్రహ సహకారం
పూర్తిగా జలమయమైన కేరళలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి 5 ఇస్రో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూమిని పరిశీలించే ఓషన్‌శాట్‌-2; రిసోర్స్‌శాట్‌-2; కార్టోశాట్‌-2, 2ఏ; ఇన్సాట్‌ 3డీఆర్‌ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు వరద చిత్రాలను పంపిస్తున్నాయి. ఇవి సహాయ పునరావాస కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కేరళ వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను గూగుల్‌ మ్యాపింగ్‌ చేసింది. సహాయ శిబిరాలు, పునరావాస కేంద్రాలను మార్కింగ్‌ చేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ మ్యాప్‌ తెరవగానే పునరావాస కేంద్రాలకు మార్గాలను సూచిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here