ఈవీఎంతో వీవీపీఏటీ బాక్సుల లింకు ట్యాంపరింగ్‌ ఆరోపణలకు కాలంచెల్లు

0
85
ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రా(ఈవీఎం)లు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయన్న ఆరోపణలు ఇకపై వినిపించే అవకాశం ఉండదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలకు ఓటర్‌ వెరిఫికేషన్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌(వీవీపీఏటీ)ను అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించినందున.. ఓటర్లకు తాము ఎవరికి ఓటు వేశామనే విషయం స్పష్టంగా తెలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఇదే విధానాన్ని అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. వీవీపీఏటీలతో అనుసంధానానికి వీలుగా తయారుచేస్తున్న ఈవీఎంలు కూడా సిద్ధమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 17 లక్షల యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో తెలంగాణ కోసం 84,400 యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు చివరి నాటికి కొత్త ఈవీఎంలు సిద్ధమవుతాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ఇటీవల ప్రకటించారు. కొత్త ఈవీఎంల్లో ఓటరు ఓటు వేయగానే.. వీవీపీఏటీలో రసీదు బయటకు వస్తుంది. వేసిన ఓటు(బ్యాలెట్‌ మాదిరిగా) ముద్రితమై రసీదు రూపంలో ఓటరుకు కనిపిస్తుంది. ఆ రసీదు వెంటనే పక్కనున్న బ్యాలెట్‌ బాక్సులోకి చేరుతుంది. దీంతో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతుందేమోనన్న అపోహలు తొలగిపోతాయని ఎన్నికల అధికారులు అంటున్నారు.
ఈవీఎం చిప్‌లలో నిక్షిప్తమైన ఓట్లు.. పక్కనే ఏర్పాటు చేసే బాక్సులో భద్రంగా ఉంటాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఏదైనా ఈవీఎం మొరాయించినా అక్కడ రీపోలింగ్‌ జరపాల్సిన అవసరం ఉండదని.. సంబంధిత ఈవీఎంకు ఏర్పాటు చేసిన బాక్సులోని ఓట్లను లెక్కిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని కల్వకుర్తిలో ఓ ఈవీఎం మొరాయించడంతో అక్కడ రీ పోలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఇక నుంచి అలాంటి అవసరం రాదని అధికారులు ధీమాగా చెబుతున్నారు. ఎన్నికలు జరిగాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ర్యాండమ్‌గా కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను అటు ఈవీఎంల నుంచి ఇటు వీవీపీఏటీ బాక్సుల నుంచి లెక్కించి సరిచూసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here