ల‌క్ష్యం మ‌ర‌చిపోవ‌ద్దు ప‌వ‌న్‌

0
108

అవినీతి, రాచ‌రిక పోక‌డలు, కులం త‌దిత‌ర అవ‌ల‌క్షణాల‌తో కుళ్లి , భ్రష్టు ప‌ట్టిన వ్యవ‌స్థలో మార్పురావాలి. మార్పుతేవాలి. ఇది సినీ అగ్రహీరో ప‌వ‌న్‌క‌ల్యాన్ ఆశ‌యం, ల‌క్ష్యం. ఈ స‌మాజం ఇలా ఉండ‌కూడ‌దు అని అంద‌రూ కోరుకునేవారు. అంద‌రూ ఆనందంగా జీవించే స‌మాజ నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలు ఎవ‌రు? కుళ్లిన స‌మాజాన్ని శుద్ధి చేస్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకొచ్చానంటున్నారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో తాను చేసిన త‌ప్పిదాన్నైనా స‌వ‌రించుకునేందుకు ఏపీ ప్రజ‌ల‌కు ఆయ‌న సేవ చేయాల్సి ఉంది.

ప‌వ‌న్ ఆశ‌యం గొప్పదే. ఆలోచ‌న‌లు ఉన్నత‌మైన‌వే. కాని ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చేస‌రికి ఆయ‌న్ను ఏవో బ‌ల‌హీన‌త‌లు వెన‌క్కి లాగుతున్నట్టనిపిస్తోంది. ఈ స‌మాజ దిశ‌, ద‌శ‌ను మార్చే శ‌క్తియుక్తులు ఈత‌రం యువ‌త‌లో పుష్కలంగా ఉన్నాయి. కొండ‌ను సైతం పిండిచేసే నైతిక స్తైర్యం ఈత‌రం యువ‌త సొంతం. “జ‌న‌సేన అంటే యువ‌త మాత్రమే ఉంటుంద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. యువ‌త రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌దు. అయితే అనుభ‌వజ్ఞుల దిశానిర్దేశం పార్టీకి చాలా అవ‌స‌రం ” అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. ఈమాట మాజీమంత్రి ముత్తా గోపాల‌కృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు శ‌శిధ‌ర్‌, ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను చేర్చుకునే సంద‌ర్భంలో అన్నారు.

తాము ఉన్న పార్టీలో సీటు ద‌క్కద‌ని తేలిన త‌ర్వాతే జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నార‌నే నిజాన్ని ప‌వ‌న్ గ్రహించాలి. త‌న  ఆశ‌యాన్ని నెర‌వేర్చే ఉద్యమానికి అలాంటి వారి వ‌ల్ల ఏం ఉప‌యోగ‌మో ఒక్కసారి ప‌వ‌న్ ఆలోచించుకోవాల్సి ఉంది. కొత్తసీసాలో పాత‌సారా మాదిరిగా జ‌న‌సేన కొత్త పార్టీ కావ‌చ్చు. కాని నాయ‌కులంతా పాత‌వారే అయిన‌ప్పుడు తాను అనుకున్న కొత్త స‌మాజాన్ని నిర్మించ‌డం ఎలా సాధ్యమో ప‌వ‌న్ పున‌రాలోచించాలి. స‌మాజాన్ని స‌మూలంగా మార్చాలంటే మ‌నుషుల సంఖ్యాబ‌లం కంటే సంక‌ల్పబ‌లం ముఖ్యమ‌నే సత్యాన్ని గ్రహించాలి.

ప్రజ‌ల గుండెల్లో స్థానం కంటే ముఖ్యమంత్రి ప‌ద‌వి పెద్దది కాద‌నడం ద్వారా జ‌నానికి ప‌వ‌న్ అగ్రస్థానం క‌ల్పించారు. ప్రజ‌ల‌ను న‌మ్ముకుని ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తే త‌ప్పకుండా వారి గుండెల్లో భ‌ద్రంగా దాచుకుంటారు. అలాకాకుండా ఏ ల‌క్షణాలైతే విసుగు పుట్టి రాజ‌కీయాల్లో ర‌ప్పించాయ‌ని చెబుతున్నారో… వాటినే అక్కున చేర్చుకునే రాజ‌కీయ పంథాను ప‌వ‌న్ ఎంచుకున్నట్టుగా క‌నిపిస్తోంది. ఇది తెలిసి లేదా తెలియ‌క జ‌రుగుతుండవ‌చ్చు. అంతిమంగా చేదు ఫ‌లాలు మాత్రం ప‌వ‌న్‌కే మిగులుతాయి. ల‌క్ష్యాన్ని గుర్తెరిగి ముంద‌డుగు వేస్తే ప‌వ‌న్‌ను త‌ప్పకుండా ప్రజ‌లు ఆద‌రిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here